నమస్తే

స్వాగతం

NewsOne కి స్వాగతం

Sign In / Register
హోమ్ రాజకీయం సినిమా క్రీడలు వ్యాపారం వార్తలు దేవాలయాలు లీగల్ వార్తలు ఆరోగ్యం

వ్యాపారం

5 వార్తలు కనుగొనబడ్డాయి

వ్యాపారం

విమానయాన సంస్థలకు కేంద్రం ఊరట

ముంబయి : ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ విమానయాన సంస్థలకు ఊరట కల్పించేందుకు గాను కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ విమానాల ల్యాండింగ్‌, పార్కింగ్‌ రుసుములను 25 శాతం తగ్గించుకోవాలని దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల పాటు ఈ తగ్గింపులు కొనసాగించాలని పేర్కొంది. ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిరిండియా లకు భారీ దెబ్బ తగిలింది. ఈక్రమంలో విమానాశ్రయాలు వసూలు చేసే కొన్ని రుసుములను తగ్గించేలా చూడమని ఆయా విమానయాన సంస్థలు కేంద్రాన్ని అభ్యర్థించాయి. ఈ క్రమంలోనే కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్స్‌ ఎకనామిక్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఈ ఆదేశాలపై స్పందించింది. ఈ తాత్కాలిక ఛార్జీల తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. కాగా.. అమెరికా- ఇరాన్‌ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విమానయాన రంగం పుంజుకుంది. ఇందులోభాగంగా ఇండిగో షేర్లు ఈరోజు ఏకంగా 10శాతం పెరిగి.. అప్పర్‌ సర్క్యూట్‌ని తాకాయి.

RAJ· 2 వారాల క్రితం
వ్యాపారం

హర్మూజ్ జలసంధి నుంచి రెండు భారతీయ గ్యాస్ నౌకల ప్రయాణం

హర్మూజ్ జలసంధి వద్ద తగ్గిన ట్రాఫిక్.ప్రస్తుతం షార్జా తీరాన ఉన్న గ్యాస్ నౌకలు.హార్ముజ్  :పశ్చిమాసియా ప్రాంతంలో గత కొన్ని రోజులుగా యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సముద్ర మార్గంలో రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. ముఖ్యంగా ఇరాన్ పక్కన ఉండే ‘హార్ముజ్ జలసంధి’ సముద్ర మార్గం గుండా వెళ్లాలంటే ఓడలు భయపడుతున్నాయి. అయితే.. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లోనూ భారతదేశానికి చెందిన రెండు పెద్ద గ్యాస్ నౌకలు తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి.భారతదేశానికి చెందిన ‘పైన్ గ్యాస్’, ‘జగ్ వసంత్’ అనే రెండు భారీ నౌకలు ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  లోని షార్జా తీరానికి సమీపంలో ఆగి ఉన్నాయి. ఇవి వంట గ్యాస్‌ను మోసుకెళ్లే నౌకలు. గత 24 గంటలుగా ఈ మార్గంలో చమురు రవాణా చేసే ఓడలేవీ కదలలేదు. కానీ… తాజా సమాచారం ప్రకారం ఈ రెండు భారతీయ నౌకలు శనివారం తమ ప్రయాణాన్ని మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. నౌకల కదలికలను గమనించే సాఫ్ట్‌వేర్ల ద్వారా ఈ విషయం బయటపడింది.ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, గ్యాస్‌లో దాదాపు 20 శాతం ఈ హార్ముజ్ మార్గం గుండానే వెళ్లాలి. కానీ.. ఇరాన్ హెచ్చరికల వల్ల ఇక్కడ రాకపోకలు ఆగిపోయాయి. అమెరికా ఆంక్షలు ఉన్న ఒక ఖాళీ నౌకను కూడా ఇరాన్ వెనక్కి పంపించేసింది. ఇలాంటి సమయంలో మన నౌకలు ముందుకు వెళ్లడం అనేది చాలా కీలకమైన విషయం.మన దేశానికి చెందిన దాదాపు 22 నౌకలు ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్నాయి. మన ఓడల భద్రత విషయంలో భారత ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంది. ‘మా నౌకలు సురక్షితంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రయాణించాలని మేము కోరుకుంటున్నాము’ అని భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇతర దేశాల నాయకులతో ఈ విషయంలో మాట్లాడుతున్నారు.గత వారంలో కూడా ఇరాన్ ప్రభుత్వం మన దేశానికి చెందిన రెండు గ్యాస్ నౌకలను వెళ్లడానికి అనుమతించింది. దీనిని బట్టి చూస్తుంటే.. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ నౌకలకు కొంత మినహాయింపు దొరుకుతుందని అర్థమవుతోంది. ఒకవేళ ఇప్పుడు ఈ రెండు నౌకలు సురక్షితంగా ప్రయాణిస్తే, రాబోయే రోజుల్లో మిగిలిన వ్యాపార నౌకలు కూడా ధైర్యంగా ముందుకు కదిలే అవకాశం ఉంటుంది.

GALLA SIVAJI · 4 వారాల క్రితం
వ్యాపారం

ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి

తొలిసారిగా 93 మార్కును దాటిన డాలర్!భారత కరెన్సీ రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రికార్డు స్థాయి పతనాన్ని చవిచూసింది. శుక్రవారం ట్రేడింగ్‌లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తొలిసారిగా 93 మార్కును దాటి సరికొత్త కనిష్ట స్థాయికి పడిపోయింది. ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.రికార్డు కనిష్ట స్థాయిలు ఇలా..బుధవారం రూపాయి 92.89 వద్ద ముగియగా, గురువారం గుడి పడ్వా సందర్భంగా మార్కెట్లకు సెలవు ప్రకటించారు. శుక్రవారం మార్కెట్ ప్రారంభం కాగానే రూపాయి 19 పైసలు క్షీణించి 93.08 వద్ద ట్రేడవుతోంది. రూపాయి మరింత పతనం కాకుండా భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) డాలర్లను విక్రయిస్తూ రంగంలోకి దిగినప్పటికీ, ఒత్తిడి మాత్రం తగ్గడం లేదు. ఆరు ప్రధాన కరెన్సీల బాస్కెట్‌తో పోలిస్తే డాలర్ బలాన్ని తెలిపే ‘డాలర్ ఇండెక్స్’ 0.17 శాతం పెరిగి 100.25 వద్దకు చేరింది.రూపాయి విలువ ఎందుకు తగ్గుతుందంటే..అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు $107 వద్ద కొనసాగుతున్నాయి. ఇది భారత్ వంటి దిగుమతి చేసుకునే దేశాల కరెన్సీపై భారాన్ని పెంచుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. మార్చి నెలలో ఇప్పటివరకు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారత మార్కెట్ల నుంచి సుమారు 8 బిలియన్ డాలర్లకు పైగా వెనక్కి తీసుకున్నారు. జనవరి 2025 తర్వాత ఇదే అతిపెద్ద ఉపసంహరణ కావడం గమనార్హం.సామాన్యుడిపై ప్రభావం ఎంత?రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతుల వ్యయం పెరుగుతుంది. దీనివల్ల దేశంలో ‘దిగుమతి ద్రవ్యోల్బణం’ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చమురు దిగుమతులు ఖరీదైనవిగా మారి, ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల ఫీజులు, విదేశీ పర్యటనలకు వెళ్లే వారి ఖర్చులు భారీగా పెరుగుతాయని వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ వంటి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు కూడా పెరగవచ్చని అభిప్రాయపడుతున్నారు.స్టాక్ మార్కెట్ ఆశలు..మరోవైపు, దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం సానుకూలంగా స్పందించాయి. సెన్సెక్స్ 960 పాయింట్లు పెరిగి 75,167 వద్ద, నిఫ్టీ 311 పాయింట్ల లాభంతో 23,313 వద్ద కొనసాగుతున్నాయి. మార్కెట్లు లాభాల్లో ఉండటం రూపాయి మరీ దారుణంగా పడిపోకుండా కొంతవరకు అడ్డుకోగలిగిందని అంటున్నారు. భవిష్యత్తులో చమురు సరఫరా మెరుగుపడితే తప్ప రూపాయికి ఇప్పుడప్పుడే ఉపశమనం లభించేలా లేదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

SURYA ARO · 4 వారాల క్రితం
వ్యాపారం

రైల్వే శాఖలో 11,127 ఉద్యోగాలు

10వ తరగతి, ఐటీఐ, బీటెక్ పూర్తి చేసిన వారికి అవకాశంన్యూ ఢిల్లీ (న్యూస్ వన్ ప్రతినిధి) మర్చి 18 :   భారతీయ రైల్వే శాఖ నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు  ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అసిస్టెంట్ లోకో పైలట్  పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు విడుదలైన ప్రాథమిక సమాచారం ప్రకారం.. మొత్తం 11,127 ఖాళీలను భర్తీ చేయనున్నారు. రైల్వే రంగంలో స్థిరమైన కెరీర్ ఆశించే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి.ముఖ్యమైన తేదీలు :  దరఖాస్తు ప్రారంభం: మే 15, 2026 నుంచి…దరఖాస్తు గడువు: జూన్ 14, 2026 వరకు.  దరఖాస్తు విధానం: అభ్యర్థులు తమకు కేటాయించిన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. గడువు తేదీ లోపు అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి.వయోపరిమితి :కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు.,గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు.నిబంధనల ప్రకారం.. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగుల వంటి రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.విద్యార్హతలు  :ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నిర్దేశించిన సాంకేతిక విద్యార్హతలను కలిగి ఉండాలి. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి టెన్త్ (10th) పాసై ఉండాలి.దీనితో పాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ  డిప్లొమా లేదా బి.టెక్ (B.Tech) వంటి ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.ఎంపిక ప్రక్రియ : రైల్వే శాఖ అత్యంత పారదర్శకంగా ఈ రిక్రూట్‌మెంట్ చేపడుతుంది. అభ్యర్థులు ఈ దశలను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో ఒకటి.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్  ఇది ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల రూపంలో ఉంటుంది. తర్వాత.. కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్  ఇది లోకో పైలట్ ఉద్యోగాలకు చాలా కీలకం. చివరగా.. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.. దీని తర్వాత మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. లోకో పైలట్ బాధ్యతల దృష్ట్యా అభ్యర్థులు కంటి చూపుతో సహా నిర్దేశిత వైద్య ప్రమాణాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న బోర్డుల ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇందులో సికింద్రాబాద్ రీజియన్ కూడా ఉంది. ఇది తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు గొప్ప అవకాశం. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయి, కోల్‌కతా, ప్రయాగ్‌రాజ్ వంటి ప్రధాన నగరాల్లోని రీజియన్లలో కూడా నియామకాలు జరుగుతాయి.

PRASAD · ఒక నెల క్రితం
వ్యాపారం

వాహనదారులకు ఊరట !

--- సోషల్ మీడియా వదంతులకు కేంద్రం ఫుల్‌స్టాప్ముంబయి (న్యూస్ వన్ ప్రతినిధి) మర్చి 18 : పశ్చిమాసియా యుద్ధం కారణంగా సోషల్ మీడియాలో చమురు, గ్యాస్‌పై విపరీతంగా వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. గ్యాస్, చమురు కొరత ఏర్పడవచ్చని పుకార్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది.పెట్రోలియం అండ్ సహజ వాయువుల మంత్రిత్వ శాఖ, జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ.. దేశంలో పెట్రోల్, డీజిల్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉందని హామీ ఇచ్చారు. ఎవరూ ఎలాంటి ఆందోళనలు చెందక్కర్లేదని భరోసా ఇచ్చారు. ‘‘సహజ వాయువు విషయానికి వస్తే నేను మీకు చెప్పినట్లుగా భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వాణిజ్య ఎల్‌పీజీ వినియోగదారులందరూ పీఎన్‌జీకి మారితే ప్రయోజనకరంగా ఉంటుంది.’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ఎల్పీజీ, పెట్రోలియం సరఫరాలు స్థిరంగా ఉన్నాయని స్పష్టం చేశారు. భారత చమురు ట్యాంకర్ ‘‘జగ్ లాడ్కి’’ ఫుజైరా నుంచి భారతదేశానికి ముడి చమురును తీసుకువస్తూ సురక్షితంగా బయలుదేరిందని వెల్లడించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, వంటగ్యాస్ నిరంతరాయంగా లభించేలా తగిన చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు.ఇక ఎల్పీజీ సిలిండర్ల కోసం భయాందోళనలతో బుకింగ్ చేసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. దేశంలో ఎక్కడా కూడా ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల దగ్గర సరఫరా నిలిచిపోయినట్లుగా నివేదికలు రాలేదని పేర్కొంది. అయినప్పటికీ అధిక సంఖ్యలో కాల్స్ రావడం వల్ల కొన్ని గ్యాస్ డిపోల దగ్గర వ్యవస్థకు అంతరాయాలు ఏర్పడి.. పొడవైన క్యూలు ఏర్పడినట్లుగా అభిప్రాయపడింది.

RAJA · ఒక నెల క్రితం
ప్రకటన (Advertisement)
హోమ్
లైవ్ TV
ఈ-పేపర్
Loading Live...
లైవ్ TV (Live)