వార్తలు
24 వార్తలు కనుగొనబడ్డాయి
వార్తలు
రూ.72 లక్షలు కట్టండి !
సెలూన్ షాపు నిర్వాహకుడికి జీఎస్టీ నోటీసులువిజయవాడ: విజయవాడలోని పంజా సెంటర్‌కు చెందిన పైడాడ శ్రీనివాసరావు అనే వ్యక్తి దాదాపు 40 ఏళ్లుగా సెలూన్ షాపును నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆయనకు రూ.72 లక్షల జీఎస్టీ చెల్లించాలని నోటీసులు రావడంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. విశాఖపట్నంలో స్క్రాప్ ఐరన్ వ్యాపారం జరిగినట్లు రికార్డులు చూపిస్తూ జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఆయన బ్యాంక్ ఖాతా నిలిపివేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.బ్యాంకుకు వెళ్లి విచారించగా.. జీఎస్టీ అధికారుల ఆదేశాల మేరకు ఖాతాను హోల్డ్ చేసినట్లు బ్యాంక్ సిబ్బంది తెలిపారు. విశాఖపట్నం వెళ్లి జీఎస్టీ అధికారులను కలవాలని బ్యాంక్ అధికారులు సూచించారు. తనకు ఎటువంటి ఐరన్ వ్యాపారం లేదని శ్రీనివాసరావు వాపోయారు. చిన్ననాటి నుంచి సెలూన్ షాపు మాత్రమే నిర్వహిస్తున్నానని చెప్పినా అధికారులు స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.శ్రీనివాసరావుకు తెలియకుండానే ఆయన ఆధార్, పాన్ కార్డు వంటి వ్యక్తిగత పత్రాలను కొందరు కేటుగాళ్లు తస్కరించి, వాటితో దొంగ వ్యాపారాలు సృష్టించి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ గొడవ వల్ల ప్రస్తుతం ఆయనకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోయాయి. న్యాయం కోసం, తన నిజాయితీని నిరూపించుకోవడం కోసం ఆ బాధితుడు ఇప్పుడు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
మున్సిపాలిటీల పునర్విభజన ప్రక్రియకు గడువు పెంపు
విజయవాడ : మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియకు గడువు పెంచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఫీల్డ్ స్టాఫ్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది 2027 జనగణన పనుల్లో నిమగ్నం కావడంతో డీలిమిటేషన్ పనులు ఆలస్యం కానున్నాయి.. రెవెన్యూ సిబ్బంది కూడా జనగణన కార్యకలాపాల్లో ఉండటంతో ప్రస్తుత షెడ్యూల్ అమలు కష్టంగా మారినట్లు అధికారులు మున్సిపల్ శాఖ దృష్టికి తీసుకెళ్లారు.. వార్డుల పునర్విభజనలో జనాభా గణాంకాల ఖచ్చితత్వం, ఫీల్డ్ స్థాయి పరిశీలన కీలకమని స్పష్టం చేశారు.. సరిహద్దుల సరిపోల్చడం, భౌగోళిక సవరణలు చేయడానికి మరింత సమయం అవసరమని నిర్ణయం తీసుకుంది మున్సిపల్ శాఖ… తొందరపాటుతో డీలిమిటేషన్ చేస్తే తప్పులు, వివాదాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పడంతో కొంత సమయం ఇస్తూ సర్క్యులర్ జారీ చేశారు..ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి ముందు అన్ని అంశాలు సమగ్రంగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది మున్సిపల్ శాఖ.. చట్టపరమైన అభ్యంతరాలు, అప్పీలు తగ్గించేందుకు కచ్చితమైన ప్రక్రియ పాటించాలని సూచించింది.. గతంలో విడుదలైన షెడ్యూల్‌ను రద్దు చేసి కొత్త షెడ్యూల్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్లకు సర్క్యులర్ పంపింది మున్సిపల్ పరిపాలన డైరెక్టర్ కార్యాలయం.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు వర్తించేలా ఉత్తర్వులు జారీ చేశారు.. దీంతో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది..
మౌనిక హత్య కేసులో కొత్త కోణం
వడ్లపూడి : విశాఖపట్నం గాజువాకలో జరిగిన యువతి మౌనిక హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో తాజాగా బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మొదట సాధారణంగా కనిపించిన ఈ ఘటనలో కొత్త కొత్త విషయాలు బయటకు రావడంతో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, మార్చి 29న మౌనికను ఆమె ప్రియుడు రవీంద్ర హత్య చేసినట్లు తేలింది. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో దాచినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసులో నిందితుడు రవీంద్రను పోలీసులు మూడు రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.దర్యాప్తులో భాగంగా పోలీసులు మరో ఇంటిని తనిఖీ చేయగా, అక్కడ కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. దీంతో ఈ హత్య కేసు మరింత క్లిష్టంగా మారింది. నిందితుడు హత్య అనంతరం లొంగిపోవడం కూడా పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు చేసిన ప్రయత్నమేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ హత్యను రవీంద్ర ఒక్కడే చేశాడా? లేక మరెవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రవీంద్ర స్నేహితుడి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మౌనికను రవీంద్ర తన నివాసంలోనే హత్య చేశాడా? లేక వేరే ప్రదేశంలో ఈ దారుణానికి పాల్పడ్డాడా? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కేసులో అనేక అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు రీ-ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ కేసులో మరెవరెవరి హస్తం ఉందనే అంశంపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ప్రజల్లో భయాందోళనలు నెలకొనగా, పోలీసులు త్వరలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశముంది.
మహా ముదురుళ్లు
చీటీల పేరుతో 15 కోట్లుతో ఘరానా మోసం తల్లి,కుమారుడిని అరెస్ట్ చేసిన కంచరపాలెం పోలీసులు ( క్రైమ్ బ్యూరో )చీటీలు పేరుతో కోట్ల మోసం అధిక లాభాల మాయలో ప్రజల నుంచి రూ.15 కోట్లు దోపిడీ కంచరపాలెంలో భారీ చిట్ఫండ్ స్కాం బయటపడింది. ప్రజలను నమ్మించి చీటీల పేరుతో 15 కోట్ల వరకు మోసగించిన కేసులో తల్లి కుమారుడిని కంచరపాలెం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కంచరపాలెం జోగరవు నగర్ కు చెందిన పట్నాల పద్మావతి ఆమె కుమారులు మహేష్,నరేష్ కుమార్,కుమార్తె తిరుమల తో కలిసి 2010 నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ అందరితో అందరితో బాగా పరీక్షలు పెంచుకుంది ఆ తర్వాత నెలవారీ,గోల్డ్,దసరా,వరలక్ష్మి చీటీల పేరుతో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించింది స్థానికలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల నుంచి సుమారు 15 కోట్ల వరకు డిపాజిట్లు సేకరించి తిరిగి చెల్లించకుండా ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి పరారయింది.*కొద్దిరోజులపాటు గాలించిన వారి ఆచూకీ తెలియకపోవడంతో నగర పోలీస్ కమిషనర్ ను కలిసి పట్నాల పద్మావతి ,ఆమె కుమారులు,కుమార్తె పై ఫిర్యాదు చేశారు.దీంతో సిపి ఆదేశాలు మేరకు కంచరపాలెం సిఐ రవికుమార్ కేసు దర్యాప్తు చేసి నిందితురాలు పట్నాల పద్మావతి,కుమారుడు మహేష్ ను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మిగిలిన వారిని త్వరలో అరెస్టు చేస్తామని కంచరపాలెం సీఐ రవికుమార్ తెలిపారు.. నిందితురాలు దుకాణం వద్ద సోమవారం రాత్రి బాధితులు ఆందోళనలు చేపట్టారు.అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా,అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలను హెచ్చరిస్తూ, అధిక లాభాల పేరుతో మోసం చేసే చీటీలు, స్కీములపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తుల వద్ద పెట్టుబడులు పెట్టేముందు పూర్తిస్థాయిలో పరిశీలించాలని కోరారు.
80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అక్కయ్యపాలెం సచివాలయ ఉద్యోగి పైలా రాజేష్.
విశాఖపట్నం ( న్యూస్ వన్ ప్రతినిధి ) మార్చి 23 : విశాఖ లో అక్కయ్యపాలెం సచివాలయం 125 లలితా నగర్ సచివాయం లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 80వేలు లంచం తీసుకుంటూ ఉండగా వార్డు ఎడ్యుకేషన్ కం డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పైలా రాజేష్ ను సచివాలయం లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.. లలితా నగర్ లో నివాసం ఉంటున్న ద్వారాపురెడ్డి గంగ రాజ్యం అతని కుమారుడు గణేష్ కి రాసిన స్థిరాస్తి సెటిల్ మెంట్ డీడ్ ప్రాసెస్ చేయడానికి 90వేలు లంచం డిమాండ్ చేయగా 80వేలకు ఒప్పందం కుదిరింది.. లంచం ఇవ్వడం ఇష్టం లేని గణేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.. దీనితో రాజేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, కోర్ట్ లో హాజరు పరచనున్నారు.. ఈ దాడుల్లో డి ఎస్ పి లు రమణ మూర్తి, హర్షిత, సి ఐ లు శ్రీనివాస్, వెంకట రావు సిబ్బంది పాల్గొన్నారు.. 1064 టోల్ ఫ్రీ ద్వారా ఏసీబీ నీ సంప్రదించ వచ్చు అని అధికారులు తెలిపారు
ప్రధాని మోడీ ప్రయాణం కోట్ల మందికి ప్రేరణ
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.విజయవాడ (న్యూస్ వన్ ప్రతినిధి) మర్చి 23 : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రభుత్వ అధిపతిగా నిరవధికంగా 8,931 రోజుల సేవ పూర్తి చేసిన సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన నరేంద్ర మోడీ రాజకీయ ప్రయాణం, భారత ప్రధానిగా కొనసాగుతూ దేశానికి విశేష సేవలు అందించిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.పదవిలో గడిపిన కాలం మాత్రమే కాకుండా, అచంచల సంకల్పం, అలసటలేని కృషి, దేశ సేవకు అంకితమైన జీవితం ప్రధాని మోడీని ప్రత్యేక నాయకుడిగా నిలబెట్టాయని ఆయన అభిప్రాయపడ్డారు పవన్ కల్యాణ్.. “గ్రాస్ రూట్ స్థాయి నుంచి గ్లోబల్ స్థాయికి దేశాన్ని నడిపిస్తూ ‘నేషన్ ఫస్ట్’ సిద్ధాంతంతో పాలనకు కొత్త నిర్వచనం ఇచ్చారు” అని పవన్ కల్యాణ్ అన్నారు. రెండు దశాబ్దాలకు పైగా క్రమశిక్షణ, త్యాగం, అపార కృషితో కొనసాగుతున్న నాయకత్వం దేశ అభివృద్ధికి దోహదపడిందని తెలిపారు. మౌలిక వసతులు, పేదల సాధికారత, డిజిటల్ మార్పులు వంటి రంగాల్లో ప్రధాని మోడీ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్టను పెంచడంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ పాత్ర కీలకమని పేర్కొన్నారు పవన్ కల్యాణ్… ఈ మైలురాయి నిజమైన నాయకత్వం స్థిరత్వం, నిబద్ధత, స్వార్థరహిత సేవపై ఆధారపడుతుందని గుర్తుచేస్తుందని అన్నారు. ఇక, ప్రధాని మోడీకి మరింత ఆరోగ్యం, శక్తి కలగాలని, దేశసేవలో ఇంకా ఎన్నో సంవత్సరాలు కొనసాగాలని ఆకాంక్షిస్తూ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘ఎక్స్’లో పోస్ట్ (ట్వీట్) పెట్టారు
ప్రతి 45 రోజులకు ఒక ఎయిర్‌పోర్ట్ : రామ్మోహన్ నాయుడు
వన్‌టౌన్ : ప్రపంచంలోనే సురక్షితమైన దేశంగా భారత్ నిలిచిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. భారత్ సుస్థిరమైన వృద్ధిని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘‘ప్రతి 45 రోజులకు ఒక విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్నాం. ఉడాన్ స్కీమ్ ద్వారా సామాన్యుడికి విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. ఎన్డీయే హయాంలో ఎయిర్‌పోర్టుల సంఖ్య 167 కు చేరింది. స్వదేశీ తయారీ విమానాలు అందుబాటులోకి వస్తే డొమెస్టిక్ సర్వీసులు మరింత విస్తృతమవుతాయి’’ అని పేర్కొన్నారు.
హిందూ మహాసముద్రం పైకి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు
ఇరాన్ : రోజురోజుకూ ఇరాన్ యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది ఈ క్రమంలోనే హిందూ మహాసముద్రం పైకి ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది మహాసముద్రంలోని యూఎస్-యూకే సైనిక స్థావరం డిగో గార్సియా లక్ష్యంగా వాటిని పంపింది. అయితే 4000 కి.మీ.దూరంలో ఉన్న టార్గెట్‌ను అవి తాకలేదని తెలుస్తోంది. ఒకటి మార్గంమధ్యలోనే విఫలమవగా, మరొకదాన్ని తమ దేశం అడ్డుకుందని అమెరికా అధికారులను ఉటంకిస్తూ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ క్షిపణులను ఎప్పుడు ప్రయోగించారన్న దానిపై స్పష్టత లేదు. డిగో గార్సియా హిందూ మహాసముద్రంలో యూఎస్-యూకేకు ఉన్న వ్యూహాత్మక సైనిక స్థావరం. హిందూ మహాసముద్రంలో 60 దీవుల సముదాయం చాగోస్ . అందులో అతిపెద్దదే డిగో గార్సియా. ఆఫ్రికా, పశ్చిమాసియాలోని కార్యకలాపాల కోసం అమెరికా దీనిని ప్రధానంగా వినియోగిస్తోంది. ఇదిలాఉంటే.. హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు, ఇరాన్‌కు చెందిన ఖర్గ్ ఐలాండ్‌ను ఆక్రమించే అవకాశాలను అమెరికా పరిశీలిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఆ క్రమంలోనే పశ్చిమాసియాలో మరో మూడు యుద్ధనౌకలను మోహరించేందుకు అమెరికా సిద్ధమైంది. యూఎస్‌ఎస్ బాక్సర్, మరో రెండు యుద్ధనౌకలు దాదాపు 2,500 మంది నౌకాదళ సిబ్బందితో పశ్చిమాసియా దిశగా వెళ్తున్నట్లు అమెరికా అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించిన సంగతి తెలిసిందే.అగ్రరాజ్యానికి చెందిన యాంఫిబియస్ అసాల్ట్ షిప్ యూఎస్‌ఎస్ ట్రిపోలీ పశ్చిమాసియా వైపు కదులుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఇరాన్‌పై సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ పరిణామాల వేళ..ఈ క్షిపణుల ప్రయోగం గురించి వెలుగులోకి వచ్చింది. తమవద్ద క్షిపణుల పరిధి 2000 కి.మీ. వరకు ఉంటుందని ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి వెల్లడించారు. కానీ చెప్పిన దానికంటే ఇరాన్ వద్ద ఉన్న మిస్సైళ్ల పరిధి చాలా ఎక్కువే ఉండొచ్చని తాజా ఘటన వెల్లడి చేస్తోంది.
నూకాంబిక అమ్మవారి జాతరలో పోలీస్ బందోబస్తుకు సన్మానం
కొత్తపేట : అంబేత్కర్ కొనసీమ జిల్లా,కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న జాతర తీర్థ మహోత్సవం ఘనంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.డీఎస్పీ మురళీమోహన్, సీఐ విద్యాసాగర్, ఎస్సై జి. నరేష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నిర్వహిస్తూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు, జాతర ప్రాంగణంలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు.ఈ క్రమంలో దేవస్థానం చైర్మన్ వీర్రి అప్పారావు పోలీసు సిబ్బందిని సన్మానిస్తూ కండువాలు కప్పి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. భక్తుల సౌకర్యార్థం పోలీసులు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండగా, భక్తులు కూడా సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించాం : మంత్రి పార్థసారథి
అమరావతి: రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటి వరకూ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి రికార్డు స్థాయిలో 6,28,347 ఉద్యోగాలు కల్పించిందని గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇందులో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలున్నాయని వివరించారు. తాజాగా ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌తో మరో 10,060 ఉద్యోగాలు వస్తాయన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఎంఎస్‌ఎంఈల ద్వారా 2.5 లక్షల మందికి, జాబ్‌మేళాలు, నైపుణ్య శిక్షణ ద్వారా 1,46,620 మందికి, ఐటీ, పర్యాటక రంగాల్లో లక్ష మందికి ఉద్యోగాలు లభించాయి. యువగళం పాదయాత్రలో లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు ఏటా ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు’’ అని పార్థసారథి తెలిపారు. జగన్ ప్రభుత్వంలో నిరుద్యోగితలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉండేదని గుర్తుచేశారు. ‘ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం వైకాపా హయాంలో ఉపాధి లేక 4,100 మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పట్లో గ్రాడ్యుయేట్లలో 24 శాతం మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారు. 2.3 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని యువతను జగన్ మోసం చేశార’ని ఆరోపించారు. జగన్‌కు హిందూ పండుగలు, దేవుళ్లపై నమ్మకం లేదని, ఇంటి పక్కనే ఆలయాలున్నా అక్కడికి వెళ్లకుండా తాడేపల్లి ప్యాలెస్‌లో సెట్టింగ్‌లు వేయించి, ఫొటోలకు పోజులిస్తారని మంత్రి విమర్శించారు.