సెలూన్ షాపు నిర్వాహకుడికి జీఎస్టీ నోటీసులు
విజయవాడ: విజయవాడలోని పంజా సెంటర్‌కు చెందిన పైడాడ శ్రీనివాసరావు అనే వ్యక్తి దాదాపు 40 ఏళ్లుగా సెలూన్ షాపును నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆయనకు రూ.72 లక్షల జీఎస్టీ చెల్లించాలని నోటీసులు రావడంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. విశాఖపట్నంలో స్క్రాప్ ఐరన్ వ్యాపారం జరిగినట్లు రికార్డులు చూపిస్తూ జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఆయన బ్యాంక్ ఖాతా నిలిపివేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.బ్యాంకుకు వెళ్లి విచారించగా.. జీఎస్టీ అధికారుల ఆదేశాల మేరకు ఖాతాను హోల్డ్ చేసినట్లు బ్యాంక్ సిబ్బంది తెలిపారు. విశాఖపట్నం వెళ్లి జీఎస్టీ అధికారులను కలవాలని బ్యాంక్ అధికారులు సూచించారు. తనకు ఎటువంటి ఐరన్ వ్యాపారం లేదని శ్రీనివాసరావు వాపోయారు. చిన్ననాటి నుంచి సెలూన్ షాపు మాత్రమే నిర్వహిస్తున్నానని చెప్పినా అధికారులు స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.శ్రీనివాసరావుకు తెలియకుండానే ఆయన ఆధార్, పాన్ కార్డు వంటి వ్యక్తిగత పత్రాలను కొందరు కేటుగాళ్లు తస్కరించి, వాటితో దొంగ వ్యాపారాలు సృష్టించి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ గొడవ వల్ల ప్రస్తుతం ఆయనకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోయాయి. న్యాయం కోసం, తన నిజాయితీని నిరూపించుకోవడం కోసం ఆ బాధితుడు ఇప్పుడు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
మొదటి వ్యాఖ్య రాయండి!